*నా కళ్ళెక్కడో పోయాయి*
అవి ఎక్కడో పోయి ఉంటాయి మణిపూర్‌లోనో, పెహల్గాంలోనో కథువాలోనో, హాత్‌రస్‌లోనో, గాజాలోనో
నా కళ్ళెక్కడో పోయాయి
ఒకప్పుడు నాకు కళ్ళున్నాయి
చరిత్ర కాగితాల్లోని- నెత్తుటి యుద్ధాల వద్దా, ద్వేషపు మారణహోమాల వద్దా గాజు పెంకుల అక్షరాలపై నా కళ్ళు నడిచిన ముద్రలు అందుకు సాక్ష్యాలు
నడుస్తున్న కాలాన- జరుగుతోన్న అమానవీయాన్ని, అమానుషాన్ని ఒంటరి గొంతులకు కోరస్ లాగా ఓ మాటగానో ఓ వాక్యంగానో బతికిన క్షణాలు అందుకు సాక్ష్యాలు
- కానీ ఇప్పుడు నా కళ్ళెక్కడో పోయాయి
శిఖరమంత ద్వేషాన్ని, స్మశానమంత విధ్వంసాన్ని చూస్తూనే పేజీ పక్కకు తిప్పేసో స్క్రీన్ కిందకి తోసేసో మరో క్షణంలోకి నిస్సిగ్గుగా జారినప్పుడే తెలిసింది నా కళ్ళు ఎక్కడో పోయాయని
- అవి ఎక్కడో పోయి ఉంటాయి మణిపూర్‌లోనో, పెహల్గాంలోనో కథువాలోనో, హాత్‌రస్‌లోనో, గాజాలోనో.. లేదా దృశ్యాల్ని తప్పించుకు నడుస్తున్నపుడు పక్కనే జీవితాల్ని కూలుస్తున్న బుల్డోజర్ చక్రాల కిందనో ఎక్కడో పడిపోయి వుంటాయి
-
చూపైతే ఉంది, కళ్ళే లేవు అవే ఉండి ఉంటే కాల్చే దృశ్యాలు కాసేపు నన్నూ కాల్చేవి మెలిబడ్డ బతుకులు లోపలేదో కదిల్చేవి బుల్డోజర్ శిథిలాలు అన్నం ముద్దలో కలిసి గొంతుకడ్డం పడేవి
ఒక కన్నీటి చుక్కగానో అక్షర రేఖగానో నన్ను రాల్చి ఉండేవి
- వీళ్ళంతా కళ్ళజోళ్ళ ప్రేమికులు మతాన్నో దేశాన్నో వకాల్తా లాక్కుని ఎవరిని ద్వేషించాలో ఎవరిని ప్రేమించాలో నిర్దేశించే ప్రవచనకారులు అన్ని దుఃఖాలూ ఒకటి కాదనే (మ)తత్వవేత్తలు
కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఉన్నాయన్న భ్రమలో బతికేవాళ్ళు వాళ్ళ ఊపిరి గాలులు
అందుకే నా కళ్ళను నేను వెతుక్కుంటున్నాను
- కొంచెం నా కళ్ళని వెతికి పెట్టండి కళ్ళజోడుని పక్కకు తీసి
- శ్రీవశిష్ఠ సోమేపల్లి
메타데이터
- post_id
- 97c1e92fdf68
- slug
- నా-కళ్ళెక్కడో-పోయాయి-97c1e92fdf68
- url
- https://medium.com/@sreevasistasomepalli/%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%95%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%A1%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF-97c1e92fdf68
- canonical_url
- https://medium.com/@sreevasistasomepalli/%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%95%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%A1%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF-97c1e92fdf68
- author_url
- https://medium.com/@sreevasistasomepalli
- status
- ok
- fetched_at
- 2026-07-14 19:24:14